telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టీటీడీ ఆస్తులు అమ్మమ‌ని దేవుడేమ‌న్నా చెప్పాడా?… మంచు మనోజ్ కామెంట్స్

Manchu-Manoj

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఉన్న భూములను అమ్మకానికి పెడుతున్నట్టు టీటీడీ పాలక మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. టీటీడీకి ఏ మాత్రం ఉపయోగపడని 50 ఆస్తులను వేలం వేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. అయితే, టీటీడీ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. టీటీడీ వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్ కూడా తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. టీటీడీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలియజేయాలని బహిరంగంగా అడిగారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ట్వీట్ చేశారు.

‘‘ఓం న‌మో వేంక‌టేశాయ‌
టీటీడీ ఆస్తులు అమ్మమ‌ని దేవుడేమ‌న్నా చెప్పాడా?
క‌రోనా సంక్షోభంలో రోజుకు ల‌క్ష మందికి ఆక‌లి తీర్చమ‌ని కూడా దేవుడు ఏమ‌న్నా చెప్పాడా?
చేసేది, చెప్పేది అంతా టీటీడీ పాల‌క మండ‌లి.
ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న ఆస్తుల‌ను, కొండ‌కి వ‌చ్చిన ల‌క్షలాది మందిని, సుప్రభాత సేవ‌కి టైమ్ అయ్యింది నిద్ర లేవాలి.. అని శ్రీ‌హ‌రిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాల‌క మండ‌లి. కొండ‌పైన ఉన్న వ‌డ్డీ కాసుల‌వాడి ఆస్తులు అమ్మకానికి వ‌చ్చాయి అంటే ‘‘గోవిందా గోవిందా’’ అని అర‌చిన ఈ గొంతు కొంచెం త‌డ‌బ‌డింది. మోసం జ‌ర‌గ‌ట్లేదు అని తెలుసు. ఎందుకంటే ఇన్‌సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా వేలం వేసి అంద‌రి ముందూ అంద‌రు చూస్తుండ‌గానే అమ్మకం జ‌రుపుతారు. కానీ, ఎందుకు అమ్ముతున్నారు?.. అని పాల‌క మండ‌లిని కాస్త వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వివ‌ర‌ణ మాత్రమే. ఏమీ లేదు సార్‌.. ఇంత పెద్ద కొండ మాకు అండ‌గా ఉంది అని చూస్తూ మురిసిపోయే తిరుప‌తి వాడిని కాబ‌ట్టి ఆపుకోలేక అడుగుతున్నా సార్‌.. అంతే. జై హింద్‌..’’ అని మనోజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, ఆస్తుల అమ్మకాల విషయంలో టీటీడీ పాలక మండలి వెనక్కి తగ్గింది. టీటీడీ భూముల వేలంపాటను ఆపేస్తున్నామని తెలిపింది. ఈ మేరకు టీటీడీ భూముల వేలంపాటపై చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. తమకు నిందలు కొత్తేమీ కాదని, తిరుమల కొండకు తాము సేవకులుగా వెళ్లామని స్పష్టం చేశారు. తమపై ఎలాంటి నిందలు వేసినా తట్టుకునే శక్తి తకుందని తేల్చి చెప్పారు. తిరుమల వెంకన్నకు రాజకీయాలు ఆపాదించొద్దని హితవు పలికారు.

 

Related posts